తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి కూడా నిలయమని తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు అన్నారు. కళలను పరిరక్షించి, ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్తు 72వ జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ కళాకారులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం, టీటీడీ నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు.
పౌరాణిక, సాంఘిక నాటకాలు, ఏకపాత్రాభినయం, లలిత సంగీత పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన నాటకోత్సవాలను ఈ ఏడాది టీటీడీ అందించిన రూ.25 లక్షల ఆర్థిక సహకారంతో తిరిగి ఘనంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. భవిష్యత్తులోనూ కళలు, కళాకారులకు టీటీడీ ఇదే విధంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు.
ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సుగుణమ్మ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గరుడ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కళాకారులు నాటకోత్సవాల్లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు.
తిరుపతిలో గతంలో కొనసాగిన పౌరాణిక నాటకాల ప్రదర్శన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని ఆమె కోరారు. కనీసం నెలకు ఒక పౌరాణిక లేదా సాంఘిక నాటకాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పది రోజుల పాటు జరిగే ఈ నాటకోత్సవాలను కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ కళలను ఆదరించే సమాజంలోనే సంస్కృతి, సంప్రదాయాలు, సుఖశాంతులు వర్ధిల్లుతాయని అన్నారు. కళాకారులు, కళాపోషకులకు టీటీడీలో సేవ చేసే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి. రవి మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టుల ద్వారా టీటీడీ కళాకారులకు విశేష ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఎస్‌వీ సంగీత, నృత్య కళాశాల, నాదనీరాజనం, ఎస్‌వీబీసీ వంటి వేదికల ద్వారా సంగీతం, నాటకం, సాంస్కృతిక రంగాలకు మరింత ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.
తిరుపతి, తిరుమలలో ఎస్‌వీబీసీ ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలను టీటీడీ పరిశీలిస్తోందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ గౌరవాధ్యక్షులు శ్రీ చిన్నంగారి రమణ, కార్యదర్శి శ్రీ మునిరత్నం, నగర ప్రముఖులు శ్రీ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, శ్రీ కుమారస్వామి రెడ్డి, కళాపరిషత్ ప్రతినిధులు, కళాకారులు, కళాభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
