సికింద్రాబాద్‌లో జరిగే ప్రసిద్ధ లష్కర్ బోనాల జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు 2, 3 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు సుమారు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లను వేగవంతం చేశారు.
ఉజ్జయినీ మహంకాళి ఆలయంతో పాటు సికింద్రాబాద్‌లోని పలు అమ్మవారి ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
బోనాల ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేకంగా తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు.
భక్తుల సౌకర్యార్థం మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రెండు బోనాల క్యూ లైన్లు, రెండు జనరల్ క్యూ లైన్లు, రెండు వీఐపీ క్యూ లైన్లు ఉంటాయి.
భక్తుల కోసం నీరు, వైద్య సదుపాయాలు
భక్తుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో 5 వాటర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం వైద్య ఆరోగ్య శాఖ 3 మెడికల్ క్యాంపులను అందుబాటులో ఉంచనుంది.
8 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం
ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం అధికారులు 8 పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. హరిహర కళా భవన్ పక్క రోడ్డు, మహబూబ్ కళాశాల స్కూల్, ఓల్డ్ జైల్‌ఖానా, మోండా మార్కెట్ వెనుక ఇస్లామియా స్కూల్, అడవయ్య ఎక్స్ రోడ్డు సమీపంలోని ఆదయ్య మెమోరియల్ స్కూల్, ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద, బెల్సన్ తాజ్ హోటల్ వద్ద, తాజ్ త్రీస్టార్ హోటల్ వద్ద వాహనాలను పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.
భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
