విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా వైభవంగా నిర్వహించిన శాకాంబరీ ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
ఉత్సవాల చివరి రోజు కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ‘జై దుర్గా.. జై జై దుర్గా’ నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శాకాంబరీ దేవి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
