అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జూన్ 25 నుంచి జూలై 3 వరకు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిత్యకైంకర్యాలు, ఉత్సవాల సందర్భంగా తెలియక జరిగిన లోపాల పరిహారార్థం ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఈ పుష్పయాగాన్ని నిర్వహించారు.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీటితో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్పాలకు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రదక్షిణ, శోభాయాత్ర నిర్వహించారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సుమారు రెండున్నర టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువ తదితర 18 రకాల పుష్పాలు, ఆరు రకాల పవిత్ర పత్రాలతో పుష్పార్చన చేశారు.
ఈ దివ్య పుష్పయాగాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం వీధి ఉత్సవం నిర్వహించడంతో పుష్పయాగ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది.
