రామాయణ కాలంతో విడదీయలేని అనుబంధం కలిగిన మధుబని జిల్లాలోని చారిత్రక క్షేత్రాలు ఇప్పుడు పర్యాటక కళను సంతరించుకోనున్నాయి. హర్లఖీ బ్లాక్‌లోని ప్రసిద్ధ కళ్యాణేశ్వర మహాదేవ్, విశ్వామిత్ర స్థావరాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు బీహార్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం సుమారు 27 కోట్ల రూపాయల భారీ నిధులను పర్యాటక శాఖ కేటాయించింది.
రామాయణ ప్రాశస్త్యం.. భక్తుల విశ్వాసం..
ఈ పుణ్యక్షేత్రాలు కేవలం కట్టడాలు మాత్రమే కావు, త్రేతాయుగపు మధుర స్మృతులకు సాక్ష్యాలు. స్థానికుల విశ్వాసం ప్రకారం..
కళ్యాణేశ్వర మహాదేవ్..
కలానా గ్రామంలో వెలసిన ఈ క్షేత్రాన్ని మిథిలా ధామానికి తొలి ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. రాజర్షి జనక మహారాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.
విశ్వామిత్ర స్థానం..
విశాల్ గ్రామంలోని ఈ ప్రదేశం ఒకప్పుడు జనక మహారాజు నివాసమైన 'సుందర సదన్'గా విరాజిల్లేది. సీతా స్వయంవరానికి తరలివచ్చిన సమయంలో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు తమ గురువు విశ్వామిత్రుడితో కలిసి ఇక్కడే బస చేశారని భక్తుల నమ్మకం. ఈ అభివృద్ధి పనుల బాధ్యతను 'బీహార్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (BSTDC)' స్వీకరించింది.
కళ్యాణేశ్వర మహాదేవ స్థావరం..రూ.13.60 కోట్లు, విశ్వామిత్ర స్థానం: రూ.13.28 కోట్లు.
జూన్ 6న టెండర్ల ప్రక్రియ..
సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టుకు మోక్షం లభిస్తూ, జూన్ 6వ తేదీన టెండర్ల ప్రక్రియను నిర్వహించనున్నారు. టెండర్లు ఖరారైన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ మౌలిక సదుపాయాలు, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు..
శ్రీరాముడు, జానకీ దేవి వివాహ ఘట్టాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల మతపరమైన పర్యాటకం పుంజుకోవడమే కాకుండా, జాతీయ స్థాయిలో ఈ క్షేత్రాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
