నవంబర్ 15న అంకురార్పణ.. 16న మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు పుష్పయాగం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 16న పుష్పయాగ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం నవంబర్ 15న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం చేపట్టనున్నారు.
స్నపన తిరుమంజనం, పుష్పయాగం
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం పూర్తయిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి తీసుకెళ్తారు. అక్కడ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకం చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
పుష్పయాగం సందర్భంగా నవంబర్ 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

