వివాహిత మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ కర్వా చౌత్. భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు మహిళలు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు. అయితే, గర్భిణులు ఇలా రోజంతా ఏమీ తినకుండా, తాగకుండా ఉపవాసం ఉండటం సురక్షితమేనా..? ఈ విషయంలో వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
నిర్జల వ్రతం సురక్షితమేనా..?
గర్భధారణ సమయంలో తల్లీబిడ్డల ఆరోగ్యానికి తగినంత నీరు, పోషకాలు, శక్తి చాలా అవసరం. గైనకాలజిస్టుల సూచనల ప్రకారం.. గర్భిణులు రోజంతా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండటం అత్యంత ప్రమాదకరం. దీనివల్ల తల్లీబిడ్డల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
ఉపవాసం వల్ల కలిగే అనర్థాలు..
డీహైడ్రేషన్..దీర్ఘకాలం పాటు నీరు తాగకపోవడం వల్ల శరీరంలో ద్రవాల శాతం పడిపోయి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
నీరసం, కళ్లు తిరగడం..కడుపు మాడ్చుకోవడం వల్ల తీవ్రమైన అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయి.
షుగర్ లెవల్స్‌లో మార్పులు.. ముఖ్యంగా మధుమేహం ఉన్న గర్భిణుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి ప్రమాదకరంగా మారుతుంది.
ఎవరు అసలు చేయకూడదు..?
జెస్టేషనల్ డయాబెటిస్, రక్తహీనత, నిరంతర వాంతులు, హై-రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి ఉపవాసాలు చేయకూడదు. గర్భం దాల్చిన మొదటి, చివరి త్రైమాసికాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
వ్రతం చేయాలనుకుంటే.. ప్రత్యామ్నాయాలు ఇవే..!
పూర్తిగా పస్తులుండే బదులు, వైద్యుల సలహాతో పండ్లు లేదా తేలికపాటి ఆహారం తీసుకుంటూ వ్రతం ఆచరించవచ్చు.
రోజంతా తగినంత నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు లాంటి ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి.
పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి.
ఎండలో తిరగడం, ఎక్కువసేపు నిలబడటం, కష్టమైన పనులు చేయడం మానుకోవాలి.
వైద్యులు సూచించిన మందులు, సప్లిమెంట్లను సమయానికి తప్పకుండా వేసుకోవాలి.
వ్రతం ఆచరించే సమయంలో తీవ్రమైన నీరసం, కళ్లు తిరగడం, కడుపునొప్పి, రక్తస్రావం లేదా కడుపులో శిశువు కదలికలు తగ్గినట్లు అనిపిస్తే.. వెంటనే ఉపవాసాన్ని విరమించి వైద్యులను సంప్రదించాలి. పండుగ ఆచారాల కంటే.. తల్లీబిడ్డల ప్రాణాలే ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

