అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయం, శ్రీ రంగనాథ స్వామివారి ఆలయాల్లో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు బాలాలయం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ అక్టోబర్ 27న వివరాలు వెల్లడించింది.
శ్రీ సీతా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారికి సంబంధించిన ఆలయాల్లో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు
అక్టోబర్ 29: గురువారం సాయంత్రం అంకురార్పణతో బాలాలయం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
అక్టోబర్ 30: చతుస్స్థానార్చన, కళాకర్షణ, ఏకాంతసేవ నిర్వహిస్తారు.
అక్టోబర్ 31: చతుస్స్థానార్చన, ప్రాయశ్చిత్త హోమం, కుంభవాహనం, మహాకుంభాభిషేకం, ద్వారదారు విగ్రహ కళావాహనం, షోడశోపచార పూజ, లఘు పూర్ణాహుతి నిర్వహిస్తారు.
నవంబర్ 1: ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. సప్తమి తిథి, పునర్వసు నక్షత్రం, ధనుర్లగ్న పుష్కరాంశంలో ఈ కార్యక్రమం జరగనుంది.
బాలాలయం ఎందుకు నిర్వహిస్తారు?
ఆలయ గర్భాలయంలో జీర్ణోద్ధరణ పనులు చేపట్టే సమయంలో బాలాలయం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ మండపంలో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి, గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను అక్కడ ఉంచుతారు.
ఆ తర్వాత మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామివారికి, అమ్మవార్లకు నిర్వహించే నిత్య కైంకర్యాలన్నీ ఈ నమూనా ఆలయంలోనే నిర్వహిస్తారు.

