తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు గురువారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.
వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు
ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన అనంతరం తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.
పూర్ణాహుతితో పవిత్రోత్సవాల ముగింపు
సాయంత్రం ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శేషగిరి, చిరంజీవి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
