హిందూ సనాతన ధర్మంలో శని భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను కర్మ ప్రదాతగా, న్యాయాధిపతిగా భక్తులు కొలుస్తారు. మనం చేసే కర్మల ఆధారంగానే ఫలితాలను ఇచ్చే దైవంగా శనిదేవుడిని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం కఠిన శ్రమ, క్రమశిక్షణ, న్యాయం, సహనానికి ప్రతీక. శనిదేవుడికి సంబంధించిన లోహాల్లో 'ఇనుము' (Iron) అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందుకే శనివారం నాడు ఇనుప వస్తువులు లేదా వాహనాలు కొనవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో కలుగుతుంటుంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్య నిపుణులు, సంప్రదాయాలు చెబుతున్న విషయాలేమిటో తెలుసుకుందాం..
ఇనుము - శనిదేవుడి సంబంధం..
జ్యోతిష్య శాస్త్రంలో ఇనుమును శనిగ్రహ కారక లోహంగా పేర్కొన్నారు. ఇనుము శ్రమకు, కార్మికులకు, కర్మాగారాలకు సంకేతం. అగ్నిలో కాలి, సుత్తి దెబ్బలను తట్టుకున్నప్పుడే ఇనుము పదునుగా, దృఢంగా మారుతుంది. అలాగే మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, పోరాటాలే వ్యక్తిని మరింత పరిపక్వత వైపు నడిపిస్తాయనే తాత్వికత దీని వెనుక కనిపిస్తుంది.
శనివారం నాడు కొనకూడదని ఎందుకు అంటారు..?
ప్రాచీన నమ్మకాల ప్రకారం, శనివారం నాడు నూతనంగా ఇనుప వస్తువులను లేదా వాహనాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం మంచిది కాదని భావిస్తారు. శనివారం ఇనుము కొంటే శని దోషం లేదా ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని, కుటుంబంలో చిన్నపాటి కలతలు లేదా ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పలువురు విశ్వసిస్తారు. అయితే ఇవి ప్రధానంగా సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిష్య శాస్త్ర ఆధారిత భావనలే తప్ప వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవని గమనించాలి.
ఇనుము కొనుగోలు కంటే 'దానం' విశిష్టమైనది..
శనివారం నాడు ఇనుప వస్తువులను ఇంటికి తీసుకురావడం కంటే, వాటిని అవసరమైన వారికి 'దానం' చేయడం అత్యంత పుణ్యప్రదమని పండితులు చెబుతుంటారు. పేదలకు, శ్రామికులకు సహాయం చేయడం, ఇనుప పాత్రలు లేదా సామగ్రిని దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా శని బాధలు తొలగుతాయని విశ్వసిస్తారు.
అత్యవసరమైతే ఏం చేయాలి..?
కొన్నిసార్లు వాహనాలు, యంత్రాలు లేదా గృహ నిర్మాణానికి అవసరమైన ఇనుప వస్తువులను శనివారమే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అటువంటప్పుడు అనుసరించదగిన కొన్ని సూచనలు.. వీలైతే ఆ వస్తువులకు సంబంధించిన నగదును ఒక రోజు ముందే శుక్రవారం చెల్లించడం ఒక పరిహార మార్గంగా కొందరు సూచిస్తారు. జాతక బలం.. జాతక చక్రంలో శనిగ్రహం అనుకూల స్థానంలో యోగకారకుడిగా ఉన్నవారికి ఇలాంటి ప్రభావాలు పెద్దగా ఉండవని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. ఎలాంటి ఆందోళన చెందకుండా ఇష్టదైవాన్ని, ఆంజనేయస్వామిని లేదా శనిభగవానుడిని స్మరించుకుని పనులు ప్రారంభించవచ్చు.
మార్గమధ్యంలో ఇనుము కనిపిస్తే..?
శనివారం నాడు ఏదైనా ఇనుప వస్తువు ఉచితంగా లభించినా లేదా మార్గంలో కనిపించినా, దానిని నేరుగా కొనుగోలు చేయడంతో సమానంగా చూడరు. అయితే ఏ వస్తువైనా స్వచ్ఛమైన భావంతో, ధర్మబద్ధంగా ఎదురైనప్పుడు అనవసరమైన భయాలు పెట్టుకోవాల్సిన పనిలేదని ఆధ్యాత్మిక నిపుణుల సలహా ఇస్తున్నారు. నమ్మకాలు, ఆచారాలు మనిషిలో క్రమశిక్షణను, భక్తిని నింపడానికే ఉద్దేశించినవి. ప్రతికూల ఆలోచనలను వీడి, శ్రద్ధతో ధర్మమార్గంలో నడిచినప్పుడు శనిదేవుడి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వసించవచ్చు.
