భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షాలు పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రశస్తమైనవి. మహాలయ పక్షంలో ప్రతి తిథికీ ఒక విశిష్టత ఉంది. ఆ క్రమంలో వచ్చే ద్వాదశీ తిథిని "ద్వాదశీ శ్రాద్ధం" లేదా "సన్యాసి శ్రాద్ధం" అని పిలుస్తారు. తమ పూర్వీకులలో ఏ పక్షంలోనైనా శుక్ల లేదా కృష్ణ పక్షం ద్వాదశీ నాడు పరమపదించిన వారికి మాత్రమే కాకుండా, లౌకిక బంధాలను వీడి సన్యాసాశ్రమం స్వీకరించిన పుణ్యాత్ములకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి ఈ తిథి విశేషమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి.
సన్యాసి శ్రాద్ధ ప్రాశస్త్యంఅంటే ..
సాధారణంగా సన్యాసం స్వీకరించిన వ్యక్తులు సాంప్రదాయక కర్మబంధాలన్నింటినీ పరిత్యజిస్తారు. వారు సమాధి చెందినప్పుడు గృహస్థుల మాదిరిగా అంత్యక్రియలు లేదా కర్మకాండలు జరగవు. అయితే, వారి ముక్తి కోసం, వారి ఆశీస్సుల కోసం పితృపక్ష ద్వాదశి నాడు ప్రత్యేకంగా శ్రాద్ధ తర్పణాలు సమర్పించే సంప్రదాయం అనాదిగా వస్తోంది.
ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో, భగవత్ సేవకు జీవితాన్ని అంకితం చేసిన యతులు, సన్యాసుల పుణ్యస్మరణకు ఈ రోజు అత్యంత పవిత్రమైనది. అందువల్లనే ఈ తిథిని 'యతి ద్వాదశి' అని కూడా వ్యవహరిస్తారు.
వైకుంఠనాథుని అనుగ్రహం..
జ్యోతిష్య, ధర్మశాస్త్రాల ప్రకారం ద్వాదశి తిథి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కు ప్రీతిపాత్రమైన రోజు. మోక్షకారకుడైన నారాయణుడి అనుగ్రహం తోడైతేనే పితృదేవతలకు సద్గతులు లభిస్తాయి. ఈ పర్వదినాన శ్రాద్ధ కర్మలతో పాటు శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి.
విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, నారాయణ మంత్ర జపం చేయడం వల్ల అనంత పుణ్యఫలాలు చేకూరుతాయి. భగవదను గ్రహంతో పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆచరించవలసిన విధులు - దాన విశిష్టత..
ద్వాదశీ శ్రాద్ధం నిర్వహించేవారు ఈ విధులను నిష్టతో పాటించడం ఆచారం..
ప్రాతఃకాల స్నానం,సంకల్పం.. ఉదయమే శుచిగా స్నానమాచరించి, పితృదేవతలను, పూర్వీకులను స్మరిస్తూ భక్తితో శ్రాద్ధ సంకల్పం చేసుకోవాలి. తర్పణం, పిండ ప్రదానం..విధివిధానంగా శాస్త్రోక్తంగా అర్హులైన పురోహితుల సమక్షంలో తర్పణ, పిండప్రదాన క్రతువులను పూర్తి చేయాలి.
భోజనం,దానధర్మాలు.. శ్రాద్ధానంతరం బ్రాహ్మణులకు, సన్యాసులకు లేదా పేదలకు భోజనం సమర్పించాలి. తమ శక్తిమేరకు అన్నదానం, వస్త్రదానం లేదా పా త్రలు దానం చేయడం విశేష ఫలప్రదం.
శ్రాద్ధ కర్మల నిర్వహణలో సమయం, ప్రాంతీయ ఆచారాల ప్రకారం స్వల్ప భేదాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక పంచాంగ విశేషాలను, పెద్దల సంప్రదాయాలను అనుసరించి శ్రద్ధతో ఈ కర్మను ఆచరించడం ద్వారా వంశాభివృద్ధి, కుటుంబంలో ప్రశాంతత లభిస్తాయని శాస్త్రోక్తి.

