సాముద్రిక శాస్త్రంలో హస్త రేఖలతో పాటు అరచేతిలోని వివిధ పర్వతాలకు కూడా విశేష ప్రాధాన్యం ఉంది. అందులో ముఖ్యమైనది మంగళ పర్వతం (కుజ పర్వతం). ఇది వ్యక్తి ధైర్యం, బలం, శక్తి, బుద్ధి, మానసిక దృఢత్వానికి ప్రతీక. హస్త సాముద్రికంలో ఈ పర్వతానికి రెండు స్థానాలు ఉంటాయి. అవేంటో, వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
అరచేతిలో మంగళ పర్వతం స్థానాలు..
హస్త సాముద్రికం ప్రకారం, అరచేతిలో మంగళ పర్వతానికి రెండు ప్రధాన స్థానాలు ఉన్నాయి. మొదటి స్థానం..నిమ్న మంగళ పర్వతం.. ఇది బొటనవేలు కింది భాగంలో, జీవన రేఖకు సమీపంలో ఉంటుంది.
రెండవ స్థానం..ఉచ్ఛ మంగళ పర్వతం.. ఇది హృదయ రేఖ, మస్తిష్క రేఖల మధ్య.. అరచేతికి వెలుపలి అంచున చిటికెన వేలు కింది భాగంలో ఉంటుంది.
కొందరి అరచేతిలో ఈ రెండు పర్వతాలు స్పష్టంగా ఉబ్బి కనిపిస్తాయి. మరికొందరిలో ఏదో ఒకటే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పర్వతాల అమరిక ఆధారంగా వ్యక్తి స్వభావాన్ని, ధైర్యాన్ని అంచనా వేస్తారు.
శారీరక ధైర్యానికి ప్రతీక.. నిమ్న మంగళ పర్వతం..
జీవన రేఖ దగ్గర ఉండే మొదటి మంగళ పర్వతం శారీరక బలానికి, ధైర్యానికి, పోరాట పటిమకు సూచిక. ఈ భాగం సమతుల్యంగా, కాస్త ఎత్తుగా ఉంటే ఆ వ్యక్తి అపారమైన ధైర్యసాహసాలు, బలమైన సంకల్ప శక్తి కలిగి ఉంటాడని, ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలడని అర్థం.
సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం, ఇటువంటి వారు రక్షణ రంగాలు ఆర్మీ, పోలీస్, పరిపాలన లాంటి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అవసరమైన వృత్తులలో సులభంగా రాణిస్తారు.
మానసిక దృఢత్వానికి సూచిక.. ఉచ్ఛ మంగళ పర్వతం
హృదయ, మస్తిష్క రేఖల మధ్య ఉండే రెండో మంగళ పర్వతం మానసిక ధైర్యానికి, ఆత్మనిగ్రహానికి ప్రతీక.
ఈ ప్రాంతం స్పష్టంగా, సమతుల్యంగా ఉంటే వారిలో ఓర్పు, సహనం, క్షమాగుణం మెండుగా ఉంటాయి.
ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. వీరు సంయమనం కోల్పోరు. చాలా ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
మంగళ పర్వతం ఎత్తుగా ఉంటే శుభమేనా..?
హస్త సాముద్రికం ప్రకారం మంగళ పర్వతం సమతుల్యంగా ఉబ్బి ఉంటే అది సానుకూల లక్షణాలకు సూచిక. అలా కాకుండా మరీ ఎత్తుగా ఉన్నా, లేదా పూర్తిగా లోపలికి నొక్కుకుపోయి ఉన్నా దాని ఫలితాలు భిన్నంగా ఉంటాయి. అయితే ఇవన్నీ సాంప్రదాయక విశ్వాసాలు మాత్రమే. కేవలం ఒక పర్వతం ఆకారం లేదా రేఖల ఆధారంగా ఒక వ్యక్తి భవిష్యత్తును, ఉద్యోగాన్ని లేదా వ్యక్తిత్వాన్ని వంద శాతం శాస్త్రీయంగా నిర్ధారించలేం. దీనిని సాముద్రిక శాస్త్రంలోని ఒక ఆసక్తికరమైన అంశంగా మాత్రమే పరిగణించాలి.

