పూజ, జపం లేదా పారాయణం పూర్తయిన వెంటనే ఉన్నపళంగా ఆసనం వదిలి లేవకూడదని, ఆసనం కింద కొద్దిగా నీటిని చల్లి ఆ నీటిని నుదుటికి, కళ్లకు అద్దుకోవాలని శాస్త్రాలు స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. దీని వెనుక అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కారణంతో పాటు అంతర్లీన శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది.
ఇంద్రుడి హక్కు-పురాణ గాథ..
ధర్మశాస్త్రాలు ,పురాణాల ముఖ్యంగా దేవీ భాగవతం, శివపురాణం వంటి గ్రంథాల ప్రకారం, ఒక సాధకుడు నిష్ఠతో జపం లేదా పూజ చేసినప్పుడు ఆ సాధన ద్వారా అమితమైన పుణ్యఫలం లభిస్తుంది.
పూజ లేదా జపం ముగిసిన వెంటనే ఆసనం కింద నీరు ప్రోక్షించ కుండా లేచి వెళ్లిపోతే, ఆ సాధన తాలూకు పుణ్యఫలాన్ని దేవతల రాజైన ఇంద్రుడు గ్రహిస్తాడని ప్రతీతి.
ఈ సమయంలో సాధకులు ఈ శ్లోకాన్ని పఠిస్తారు.. "ఓం శక్రాయ నమః" లేదా "ఇంద్రాయ నమః" అని స్మరిస్తూ ఆసనం కింద రెండు బొట్లు నీరు వేస్తారు. నీటిని చల్లడం ద్వారా భూమాతకు, దేవతలకు అర్ఘ్యప్రదానం చేసి, "నా సాధనా ఫలాన్ని రక్షించుకుంటున్నాను" అని సంకల్పించుకోవడం ఇందులో అంతరార్థం. ఆ తర్వాత ఆ తడిని వేళ్లతో తాకి కళ్లకు, నుదుటికి అంటే ఆజ్ఞా చక్రానికి అద్దుకుంటారు.
ఆ శక్తిని సొంతం చేసుకోవడం..
జపం, పూజ లేదా ధ్యానంలో నిమగ్నమైనప్పుడు శరీరంలో అంతర్గతంగా ప్రాణశక్తి, సాత్విక ప్రకంపనలు (Vibrations) గణనీయంగా పెరుగుతాయి. ఆసనం కింద నీటిని స్పర్శించి కళ్లకు, ఆజ్ఞా చక్రానికి అద్దుకోవడం వల్ల పూజ ద్వారా ఉత్పన్నమైన దివ్యమైన ఆధ్యాత్మిక తేజస్సు, సానుకూల తరంగాలు సాధకుడి శరీరంలో సంపూర్ణంగా నిక్షిప్తమవుతాయి. భూమాతకు కృతజ్ఞతగా సమస్త భారాన్ని మోస్తూ, పూజకు స్థానాన్ని ఇచ్చిన భూమాతకు నమస్కరించి, శాంతింపజేయడానికి నీటిని ప్రోక్షిస్తారు.
