devotional news

వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు..?

 

భాద్రపద శుక్ల చతుర్థి పర్వదినాన దేశవ్యాప్తంగా వినాయక చవితి మహోత్సవాలు అంబరాన్నంటు తాయి. సకల విఘ్నాలను తొలగించి, సర్వకార్యాల లో విజయాన్ని ప్రసాదించే ప్రథమ పూజ్యుడు గణనాథుడు అవతరించిన పవిత్ర దినమిది. వాడవాడలా కొలువుదీరే గణపతి మండపాలు, ఇళ్లలో భక్తిశ్రద్ధలతో చేసే మృత్తికా గణపతి పూజలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడు తుంది.


లంబోదరుని జనన విశిష్టత..


పురాణాలో చెప్పిన విధంగా.. పార్వతీదేవి తన శరీర నలుగుపిండితో ఒక బాలుడి రూపాన్ని సృష్టించి ప్రాణప్రతిష్ఠ చేసింది. అనంతరం స్నానానికి వెళ్తూ గుమ్మం వద్ద ఎవరినీ లోపలికి రానివ్వవద్దని ఆజ్ఞాపించింది. ఆ సమయంలో వచ్చిన పరమశివు డిని ఆ బాలుడు అడ్డగించడంతో శివుని త్రిశూల ప్రయోగం వల్ల బాలుని శిరస్సు ఛేదించ బడింది. విషయం తెలుసుకున్న జగన్మాత విలపించడంతో, శాంతింపజేసేందుకు ఉత్తర దిశగా తలపెట్టి నిద్రిస్తున్న ఏనుగు శిరస్సును తెప్పించి బాలుని శరీరానికి సంధించి పునర్జీవితుడిని చేశారు. సమస్త దేవతల శక్తులతో పాటు "ఏ పూజ ప్రారంభమైనా మొదట వినాయకుడికే అగ్రతాంబూలం దక్కుతుంది" అని పరమశివుడు వరం ప్రసాదించాడు.


విగ్రహ ప్రతిష్ఠాపన,పూజా విధానం..


మట్టి వినాయకుడే శ్రేష్ఠం..ప్రకృతి నియమాలకు అనుగుణంగా స్వచ్ఛమైన బంకమట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం శాస్త్రోక్తం, పర్యావరణ హితం. ప్రాణప్రతిష్ఠ..ఉదయం శుభ ముహూర్తంలో పీఠంపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి, బియ్యం పోసి దానిపై మట్టి వినాయకుడిని కొలువుదీర్చి, వేద మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఏకవింశతి అంటే 21 రకాల పత్రి పూజ.. మాచీపత్రం, మారేడు, గరిక, దర్భ, ఉమ్మెత్త, తులసి తదితర 21 రకాల ఔషధ గుణాలున్న పత్రాలతో స్వామిని పూజించడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. కుడుములు, మోదకాలు, ఉండ్రాళ్ళు, పాయసం, జిల్లేడు కాయలు, బేరిపండ్లు, కొబ్బరి ముక్కలను లంబోదరునికి భక్తితో నివేదిస్తారు. 


శమంతకోపాఖ్యానం,కథా శ్రవణం..


వినాయక చవితి వ్రత కథను తప్పక విని, అక్షతలను తలపై ధరించడం వల్ల నిష్కారణంగా వచ్చే అపనిందలు, నీలాపనిందల దోషం తొలగిపోతుంది. తొమ్మిది లేదా పదకొండు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో విశేష పూజలు అందుకున్న గణనాథుడిని చివరికి పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయడం ద్వారా ఈ వేడుకలు పూర్తవుతాయి.


వినాయక చవితి నాడు చంద్రదర్శన నిషిద్ధం ఎందుకంటే కారణం ఇదే.. 


భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆకాశంలో చంద్రుడిని చూడకూడదనే నియమం అనాదిగా వస్తోంది. ఒకవేళ పొరపాటున ఆ రాత్రి చంద్రుడిని దర్శిస్తే నిష్కారణంగా అపనిందలు, చెడ్డపేరు మూటగట్టు కోవాల్సి వస్తుందని భక్తుల నమ్మకం. దీని వెనుక పురాణాల్లో వినాయకుడు చంద్రుడికి ఇచ్చిన శాపం, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి ఎదురైన శమంతకమణి వృత్తాంతం ఆధారంగా ఉన్నాయి.చంద్రునికి గణపతి శాపం..భాద్రపద శుక్ల చతుర్థి నాడు భక్తులు సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండివంటలను ఆరగించి వినాయకుడు తన వాహనమైన మూషికంపై కైలాసానికి బయలుదేరాడు. దారిలో ఒక పాము అడ్డం రావడంతో మూషికం బెదిరి తూలింది. ఆ తూలనంలో గణపతి కిందపడటంతో పొట్ట పగిలి అందులోని కుడుములు బయటకు వచ్చాయి. గణపతి వెంటనే వాటిని మళ్లీ పొట్టలో సర్దుకుని, ఆ పామునే నడుముకు దారంగా కట్టుకున్నాడు.


ఈ దృశ్యాన్ని ఆకాశం నుంచి చూసిన చంద్రుడు తన అందంపై గర్వంతో వినాయకుడి విచిత్ర రూపాన్ని, స్థూలకాయాన్ని చూసి విరగబడి నవ్వాడు. చంద్రుని అహంకారాన్ని, పరిహాసాన్ని గమనించిన గణనాథుడు ఆగ్రహించి "గర్వంతో కళ్లు మూసుకుపోయిన నీ ముఖాన్ని ఎవరూ చూడకూడదు.. భాద్రపద శుక్ల చతుర్థి నాడు నిన్ను చూసిన వారికి నీలాపనిందలు చుట్టుముడతాయి" అని శపించాడు. చంద్రుని రూపం మసకబారడంతో దేవతలందరూ ప్రార్థించగా, కరుణించిన లంబోదరుడు శాప తీవ్రతను తగ్గించాడు. ఏడాది పొడవునా కాకుండా, కేవలం భాద్రపద శుక్ల చతుర్థి నాడే చంద్రుడిని చూడకూడదని ఉపశమనం ప్రసాదించాడు.


 శ్రీకృష్ణుని నీలాపనిందలు..


గణపతి శాపం ఎంతటి శక్తిమంతమైనదో నిరూపించే ఉదంతం ద్వాపరయుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడికే ఎదురైంది. ఒక వినాయక చవితి రాత్రి శ్రీకృష్ణుడు పాలు తాగుతుండగా, పాత్రలోని పాలలో ప్రతిబింబించిన చతుర్థి చంద్రుడిని అనుకోకుండా చూశాడు.


దాని ఫలితంగా, సత్రాజిత్తు వద్ద ఉన్న అద్భుతమైన ‘శమంతకమణి’ని శ్రీకృష్ణుడే దొంగిలించి, అతని సోదరుడు ప్రసేనుడిని చంపాడనే తీవ్రమైన నింద కృష్ణుడిపై పడింది. ఆ అపనిందను బాపుకోవడానికి శ్రీకృష్ణుడు అడవికి వెళ్లాడు. అక్కడ ప్రసేనుడిని చంపిన సింహాన్ని సంహరించి శమంతకమణిని తీసుకువెళ్లిన జాంబవంతుడితో 28 రోజుల పాటు భీకరంగా యుద్ధం చేశాడు. చివరికి జాంబవంతుడు శ్రీకృష్ణుడిని శ్రీరాముని అవతారంగా గుర్తించి, మణితో పాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు. ద్వారకకు తిరిగి వచ్చి మణిని సత్రాజిత్తుకు అప్పగించి నిందల నుంచి విముక్తుడయ్యాడు. ఆపై భాద్రపద చతుర్థి నాడు వినాయక వ్రతం ఆచరించి, అక్షతలు శిరస్సుపై ధరించి దోష నివారణ పొందాడు.


పొరపాటున చంద్రుడిని చూస్తే చదవవలసిన దోష నివారణ శ్లోకం


వినాయక చవితి నాడు అనుకోకుండా చంద్రదర్శనం జరిగితే, చేతిలో పవిత్రమైన అక్షతలు లేదా నీటిని పట్టుకుని ఈ క్రింది శ్లోకాన్ని భక్తితో పఠించి, ఆ అక్షతలను తలపై చల్లుకోవాలి:


సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః ।


సుకుమారక మా రోదీస్తవ హ్యేష శ్యమంతకః ॥


 తాత్పర్యం.. ఓ సుకుమారుడా ..జాంబవంతుని కుమారుడా! ఏడవకు. ప్రసేనుడిని సింహం చంపింది, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఇప్పుడు ఈ శమంతకమణి నీదే, ఏడవకు.

వ్రత కథను విని, పూజించిన అక్షతలను శిరస్సున ధరించిన వారికి ఎలాంటి అపనిందలు, దోషాలు అంటవని విశ్వసిస్తారు.

తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బà...

View Post

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

September 25, 2026

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు...

View Post

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 24, 2026

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్స...

View Post

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

September 24, 2026

 తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైà...

View Post

అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారి దివ్యదర్శనం

September 23, 2026

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎని...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 227528