హిందూ సాంప్రదాయంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెలకు రెండు చొప్పున వచ్చే ప్రతి ఏకాదశికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ భాద్రపద మాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'అజా ఏకాదశి' లేదా 'అన్నదా ఏకాదశి' అని పిలుస్తారు. శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించే ఈ పవిత్ర దినాన ఉపవాసం ఉంటే సకల పాపాలు పటాపంచలై, మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 2026 సెప్టెంబర్ 7వ తేదీన అజా ఏకాదశి పర్వదినం వచ్చింది. ఈ సందర్భంగా ఈ ఏకాదశి విశిష్టత, వ్రత కథ, పూజా నియమాల గురించి తెలుసుకుందాం..
విశిష్టత..?
ఇంద్రియాలను జయించే శక్తి..అజా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మవైవర్త పురాణంలో సాక్షాత్తూ శ్రీకృష్ణుడు.. ధర్మరాజుకు వివరించాడు. ఇంద్రియాలను నియంత్రించే శ్రీహరి రూపమైన 'హృషీకేశుడిని' ఈ రోజు పూజిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగిపోవడమే కాకుండా, పూర్వజన్మ పాపాలు సైతం నశిస్తాయి. దుష్ట శక్తుల నుంచి రక్షణ లభించి, జీవితంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయి.
వ్రత కథ..?
అజా ఏకాదశి మహత్యాన్ని వివరించేందుకు సత్య హరిశ్చంద్రుని కథను ఉదాహరణగా చెబుతారు. విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని, సిరిసంపదలను వదులుకున్న హరిశ్చంద్రుడు.. చివరకు తన భార్యాబిడ్డలను సైతం అమ్ముకుని, ఓ కాటికాపరి వద్ద సేవకుడిగా మారతాడు. ఆ దుర్భర స్థితిలో తీవ్ర మనోవేదనకు గురవుతున్న సమయంలో గౌతమ మహర్షి అతడికి దర్శనమిచ్చి, ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు 'అజా ఏకాదశి' వ్రతాన్ని ఆచరించమని సూచిస్తాడు.
మహర్షి సూచనల మేరకు హరిశ్చంద్రుడు ఎంతో నియమనిష్ఠలతో అజా ఏకాదశి ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తాడు. ఈ వ్రత మహాత్మ్యం వల్ల.. పాముకాటుతో మరణించిన అతని కుమారుడు రోహిదాస్యుడు తిరిగి ప్రాణాలతో లేస్తాడు. భగవంతుని కరుణతో హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని తిరిగి పొంది, చివరకు కుటుంబ సమేతంగా స్వర్గానికి చేరుకుంటాడు.
పూజా విధానం, నియమాలు..
ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానమాచరించాలి.
పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, ఒక పీటంపై కలశాన్ని ఏర్పాటు చేసి విష్ణుమూర్తి అవతారం హృషీకేశుడి ప్రతిమను లేదా సాలగ్రామాన్ని ప్రతిష్ఠించి పూజించాలి. సాలగ్రామానికి పంచామృతాలతో అభిషేకం చేయడం ఎంతో శ్రేయస్కరం.
తులసి దళాలు, పసుపు, కుంకుమ, పూలతో స్వామిని అలంకరించి.. నైవేద్యాన్ని సమర్పించాలి.
ఏకాదశి రోజున ధాన్యాలు, పప్పు దినుసులు తీసుకోకూడదు. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లికి పూర్తిగా దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి.
పగలు నిద్రపోకూడదు. రాత్రి కూడా జాగరణ చేస్తూ 'ఓం నమో నారాయణాయ', 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాలతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉదయం నిర్ణీత ముహూర్తంలో పారణ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి ఉపవాసాన్ని విరమించాలి.
దానధర్మాల ప్రాముఖ్యత..?
అజా ఏకాదశి రోజున చేసే దానానికి ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది. పేదవారికి బియ్యం, గోధుమలు, పండ్లు, లేదా అన్నదానం చేయడం మంచిది. చలికాలంలో ఉపయోగపడేలా దుప్పట్లు, వస్త్రాలు దానం చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలను పంచిపెట్టడం శుభప్రదం. గోశాలలకు ఆర్థిక సాయం లేదా పశుగ్రాసం సమకూర్చడం గోదానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
