హిందూ సనాతన ధర్మంలో 'జంధ్యం' అంటే యజ్ఞోపవీతం ధారణకు ఎంతో పవిత్రమైన, ఆధ్యాత్మిక స్థానం ఉంది. షోడశ సంస్కారాలలో ఒకటైన ఉపనయనం ద్వారా బాలుడికి దీనిని ధరింపజేస్తారు. జంధ్యం వేసుకున్న తర్వాతే వేదాధ్యయనం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అర్హత లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
జంధ్యంలోని మూడు పోగుల పరమార్థం
జంధ్యం కేవలం ఒక దారం కాదు, దానికి ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది.
మూడు ఋణాలు..
జంధ్యంలో ఉండే మూడు పోగులు ప్రతి మనిషి తీర్చుకోవాల్సిన దేవ ఋణం, పితృ ఋణం, ఋషి ఋణాలకు ప్రతీకగా చెబుతారు.
త్రిగుణాలు..
మనిషిలోని సత్వ, రజో, తమో గుణాలకు కూడా ఇవి సంకేతాలు. ఈ మూడు గుణాలను సమతుల్యంగా ఉంచుకోవాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది.
త్రిమూర్తులు..
ఈ మూడు దారాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపాలని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి దీన్ని ధరించడం అత్యంత పుణ్యప్రదం.
ఉపనయన సంస్కారం విశిష్టత..
బాలుడికి మొదటిసారిగా జంధ్యం వేసే కార్యక్రమాన్ని ఉపనయన సంస్కారం అంటారు. ఈ సంస్కారం పూర్తయిన తర్వాతే గురువు వద్ద వేదాభ్యాసం చేసే అర్హత దక్కుతుంది. ఇది బాలుడి జీవితంలో రెండవ జన్మతో సమానం అని పరిగణిస్తారు. అందుకే జంధ్యం ధరించిన వారిని 'ద్విజులు' అంటే రెండు జన్మలు కలవారు అని కూడా పిలుస్తారు.
యజ్ఞోపవీత నియమాలు, మార్చుకునే సమయం
యజ్ఞోపవీతాన్ని ధరించే వారు తప్పనిసరిగా కొన్ని పవిత్రమైన నియమాలను పాటించాలి:
ధరించే విధానం: జంధ్యాన్ని ఎల్లప్పుడూ ఎడమ భుజం మీదుగా కుడివైపు నడుము వైపునకు ఉపవీతం ఉండేలా ధరించాలి. శుభకార్యాలలో ఇదే స్థితిలో ఉండాలి.
చెవికి చుట్టడం..మలమూత్ర విసర్జన తదితర కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో జంధ్యం అపవిత్రం కాకుండా కుడి చెవికి చుట్టుకునే సంప్రదాయం ఉంది.
ఖండితమైతే..జంధ్యం తెగిపోయినా లేదా బాగా మలినమైనా వెంటనే తీసేసి కొత్తది ధరించాలి. తెగిన దానిని ధరించడం అశుభంగా భావిస్తారు.
శ్రావణ పౌర్ణమి: ఏటా వచ్చే శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ రోజున పాత జంధ్యాన్ని విడిచిపెట్టి, శాస్త్రోక్తంగా కొత్త జంధ్యాన్ని ధరించడం ఎంతో శుభప్రదం. దీని ద్వారా పాత సంకల్పాలు పునరుద్ధరించబడతాయని నమ్మకం.
ఆధునిక కాలంలో జీవనశైలిలో ఎన్ని మార్పులు వచ్చినా, ఈ యజ్ఞోపవీత ధారణ సంప్రదాయాన్ని అనేక హిందూ కుటుంబాలు నేటికీ అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తూనే ఉన్నాయి.
