వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి అంటే సింహద్వారం అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంట్లోకి పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలు ప్రవేశించేది ఇక్కడి నుంచే అని పండితులు చెబుతారు. ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రధాన ద్వారానికి గడప ఉండటం ఎంతో ముఖ్యం. ఆధునిక ఇళ్ల నిర్మాణంలో ఈ సంప్రదాయం క్రమంగా కనుమరుగవుతున్నప్పటికీ, వాస్తు ప్రకారం గడప, దాని చుట్టుపక్కల వాతావరణం కుటుంబ సుఖశాంతులతో ముడిపడి ఉంటాయి.
గడప ప్రాముఖ్యత ఏమిటి..?
వాస్తు విశ్వాసాల ప్రకారం, గడప కేవలం ఇంటి నిర్మాణంలో భాగం మాత్రమే కాదు.. అది ఇంటికి రక్షణ, శక్తి సమతుల్యతకు ప్రతీకగా పరిగణిస్తారు. బయటి నుంచి వచ్చే ప్రతికూల శక్తులను ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడంలో గడప ఒక రక్షణ కవచంలా సహాయపడుతుందని విశ్వసిస్తారు. అందుకే పాత కాలంలో ప్రతి ఇంటికీ తప్పనిసరిగా గడపను ఏర్పాటు చేసేవారు.
సింహద్వారం ఎత్తు ఎలా ఉండాలి..?
వాస్తు ప్రకారం, ఇంటి సింహద్వారం ఎల్లప్పుడూ వీధి లేదా రోడ్డు స్థాయి కంటే కొంచెం ఎత్తులో ఉండటం శుభప్రదం. ఒకవేళ రోడ్డు కంటే ద్వారం కిందకు ఉంటే వాస్తు దోషం ఏర్పడుతుందని చెబుతారు. దీనివల్ల ఆ ఇంట్లో నివసించే వారికి మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో పాటు పనుల్లో తరచూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ప్రధాన ద్వారం వద్ద ఈ వస్తువులు ఉంచకూడదు..
సింహద్వారం చుట్టుపక్కల వాతావరణం ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు ఉండకూడని ప్రధానమైన వస్తువులు ఇవే..
ముళ్ల మొక్కలు..
ఇంటి ముఖద్వారం ఎదురుగా కాక్టస్ లేదా ఇతర ముళ్ల మొక్కలను పెంచకూడదు. ఇవి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్థలను పెంచుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
పాలు కారే మొక్కలు..
ఆకులు లేదా కొమ్మలు తుంచినప్పుడు తెల్లటి పాలు కారే మొక్కలను సింహద్వారం ముందు ఉంచడం అశుభం. వీటివల్ల ఆర్థిక అస్థిరత, కుటుంబ వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది.
రాళ్లు లేదా శిథిలాలు..
ఇంటి ముందు రాళ్లు, ఇటుకలు లేదా ఇతర నిర్మాణ సామాగ్రిని కుప్పలుగా పోసి ఎక్కువ కాలం ఉంచకూడదు. ఇవి మీ జీవితంలో, పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను, జాప్యాన్ని సూచిస్తాయి.
చెత్తకుండీ..
ప్రధాన ద్వారానికి సరిగ్గా ఎదురుగా చెత్తకుండీని ఉంచడం వాస్తు శాస్త్రం ప్రకారం విరుద్ధం. దీనివల్ల ఇంటి పరిసరాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి చెత్తను ఎల్లప్పుడూ శుభ్రమైన, ఇంటికి దూరంగా ఉండే సరైన స్థలంలో ఉంచాలి.
భారీ వృక్షాలు..
ఇంటి సింహద్వారానికి ఎదురుగా పెద్ద పెద్ద, గుబురుగా ఉండే చెట్లు ఉండటం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇవి ఇంట్లోకి వచ్చే సహజమైన వెలుతురు, గాలిని అడ్డుకుంటాయి. ఫలితంగా ఇంట్లో సానుకూల వాతావరణం దెబ్బతింటుంది.
వాస్తు శాస్త్ర నియమాలను విశ్వసించే వారు ప్రధాన ద్వారం దిశ, ఎత్తు, పరిసరాల పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించడం మంచిది. అయితే, ఈ వాస్తు విశ్వాసాలకు ఎలాంటి కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని కేవలం తరతరాలుగా వస్తున్న నమ్మకాలు, సంప్రదాయాల ఆధారంగా మాత్రమే పాటించవచ్చు.
