సనాతన ధర్మంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన, పూజనీయమైన స్థానం ఉంది. తులసి కోట ఉన్న ఇల్లు బృందావనంతో సమానమని, నిత్యం తులసిని పూజించే ఇంట్లో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపంగా భావించే తులసి మాతకు నీరు సమర్పించేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. ఏమాత్రం పొరపాటు చేసినా ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. తులసి పూజలో పాటించాల్సిన ఆ నియమాలేంటో తెలుసుకుందాం..
ఏ రోజుల్లో నీరు సమర్పించకూడదు..?
ధార్మిక విశ్వాసాల ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన తిథులు, రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయడం నిషిద్ధం.
ఆదివారం..పురాణాల ప్రకారం, ఆదివారం నాడు తులసి మాత శ్రీ మహావిష్ణువు కోసం నిర్జల ఉపవాసం అంటే నీరు కూడా ముట్టుకోకుండా ఉంటుంది. కాబట్టి ఆ రోజున తులసి మొక్కకు నీరు పోయకూడదు. నీరు పోస్తే అమ్మవారి ఉపవాసానికి భంగం వాటిల్లినట్లేనని చెబుతారు.
ఏకాదశి తిథి..పవిత్రమైన ఏకాదశి రోజున కూడా తులసికి నీరు సమర్పించరాదు. అయితే, ఆ రోజు సాయంత్రం వేళ తులసి కోట దగ్గర నేతి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం.
గ్రహణ సమయాలు..సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో కానీ, లేదా సూతక కాలంలో అంటే అంటు సమయంలో కానీ తులసి మొక్కను తాకడం లేదా నీరు పోయడం చేయకూడదు.
నీరు పోసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన నియమాలు
వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం తులసికి జలకార్యక్రమం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి...
స్నానం చేశాకే జల సమర్పణ..
స్నానం చేయకుండా, అపవిత్రంగా ఉన్నప్పుడు తులసి మొక్కను తాకడం మహాపాపంగా పరిగణిస్తారు. ఉదయాన్నే స్నానమాచరించి, ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించిన తర్వాతే భక్తితో జలం సమర్పించాలి.
వేగంగా ధారగా పోయకూడదు..
తులసికి నీరు పోసేటప్పుడు ఒకేసారి వేగంగా, పెద్ద ధారగా కుమ్మరించకూడదు. రాగి చెంబు లేదా శుభ్రమైన పాత్రతో చాలా నెమ్మదిగా, తగిన మోతాదులో మాత్రమే నీటిని సమర్పించాలి.
ఆకులు తెగకుండా జాగ్రత్త..
నీరు పోసే క్రమంలో తులసి మొక్క ఆకులు తెగిపోకుండా, రాలిపోకుండా అప్రమత్తంగా ఉండాలి. బలవంతంగా ఆకులు తెంచడం లేదా ఆకులు నేలరాలడం అశుభానికి సంకేతంగా భావిస్తారు.
తులసి పూజ విశిష్టత..
నిత్యం ఉదయం, సాయంత్రం తులసి మాతను భక్తిశ్రద్ధలతో పూజించి దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు (Negative Energy) నశించిపోతాయి. సంధ్యా సమయంలో తులసి కోట ముందు దీపం వెలిగిస్తే శ్రీహరితో పాటు మహాలక్ష్మి అనుగ్రహం ఏకకాలంలో లభిస్తుందని, ఆ ఇంట ఎన్నటికీ ఆర్థిక ఇబ్బందులు, దారిద్ర్యం దరిచేరవని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
