అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, రక్షణ సంకల్పానికి ప్రతీక రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి. సోదరుడి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను ఆకాంక్షిస్తూ సోదరి ప్రేమతో కట్టే రక్షా సూత్రమే రాఖీ. అయితే, పండుగ ముగిసిన తర్వాత ఈ రాఖీని కచ్చితంగా ఎన్ని రోజులు ఉంచుకోవాలి? ఎప్పుడు తీసేయాలి? తీసిన రాఖీని ఏం చేయాలి? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. ధర్మశాస్త్రాలు, పండితులు ఈ విషయంపై పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
2026లో రాఖీ పౌర్ణమి ఎప్పుడంటే..
దృక్ పంచాంగం ప్రకారం, 2026 సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:09 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథి (ఉదయ తిథి) ప్రామాణికంగా ఆగస్టు 28, శుక్రవారం నాడు రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు.
రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి..?
రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలనే విషయంలో ప్రాంతాలు, కుటుంబ ఆచారాలను బట్టి వేర్వేరు నియమాలు ఉన్నాయి. అయితే ధార్మిక విశ్వాసాల ప్రకారం.. రాఖీని కనీసం 24 గంటల పాటు మణికట్టుపై ఉంచుకోవడం శుభప్రదం.
చాలా కుటుంబాల్లో దీనిని 3 నుంచి 7 రోజుల పాటు ఉంచుకుంటారు.
మరికొన్ని ఇళ్లలో శ్రీకృష్ణాష్టమి వరకు రాఖీని ఉంచుకుని, ఆ రోజున కన్నయ్యకు పూజ చేసిన అనంతరం తీసేసే ఆనవాయితీ కూడా ఉంది. దీన్ని శ్రీకృష్ణుని పట్ల ఉన్న భక్తికి ప్రతీకగా భావిస్తారు.
అందువల్ల రాఖీని ఎప్పుడు తీసేయాలనేది ప్రధానంగా వారి వారి కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది.
రాఖీ తీసేటప్పుడు పాటించాల్సిన నియమాలు
రాఖీని సాధారణ దారంగా భావించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకూడదు. ఇది అన్నాచెల్లెళ్ల బంధానికి, రక్షా సూత్రానికి ప్రతీక. కాబట్టి తీసేటప్పుడు కూడా ఎంతో భక్తిశ్రద్ధలు చూపించాలి. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత, ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ప్రశాంతమైన మనసుతో రాఖీని విప్పాలి. పొరపాటున కూడా దానిని నేలపై లేదా అపరిశుభ్రమైన ప్రదేశాల్లో పడేయకూడదు.
పాత రాఖీని ఏం చేయాలి?
తీసేసిన రాఖీని ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తబుట్టలో వేయకూడదు. ఒకవేళ భద్రపరుచుకోవాలి అనుకుంటే, ఒక శుభ్రమైన పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి పూజగదిలో లేదా శుభ్రమైన ప్రదేశంలో ఉంచుకోవచ్చు.
పర్యావరణానికి హాని చేయని, సహజ సిద్ధమైన దారాలతో చేసిన రాఖీలైతే.. ప్రవహించే నీటిలో నది లేదా కాలువలో నిమజ్జనం చేయడం ఉత్తమం.
ప్లాస్టిక్, లోహాలు, సింథటిక్ వస్తువులతో చేసిన రాఖీలను మాత్రం నీటిలో వేయకూడదు. పర్యావరణ రక్షణ దృష్ట్యా వాటిని తీసుకెళ్లి ఒక చెట్టు మొదట్లో మట్టిలో పాతిపెట్టడం మంచిది.
రాఖీ అనేది కేవలం మణికట్టుకు కట్టే దారం మాత్రమే కాదు.. సోదరుడి శ్రేయస్సును కోరుకునే సోదరి ఆశీర్వచనం. ఆ పవిత్ర భావనకు గౌరవం ఇస్తూ, ఈ నియమాలు పాటించడం ధర్మసమ్మతం.
