హిందూ సంప్రదాయంలో ప్రతినెలా వచ్చే కృష్ణ పక్ష అష్టమిని 'కాలాష్టమి'గా మాసిక కాలాష్టమి గా పిలుస్తారు. ఈ రోజు సాక్షాత్తూ పరమశివుడి రౌద్ర రూపమైన కాలభైరవ స్వామిని పూజిస్తారు. 2026 వ సంవత్సరంలో భద్రపద మాస కాలాష్టమి సెప్టెంబర్ 4వ తేదీ ,శుక్రవారం నాడు జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన స్వామివారిని నిష్టతో కొలిస్తే సర్వ భయాలు తొలగిపోయి, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కాలాష్టమి తిథి, శుభ ముహూర్తం..
పంచాంగ లెక్కల ప్రకారం, భద్రపద కృష్ణ పక్ష అష్టమి తిథి 2026 సెప్టెంబర్ 4 శుక్రవారం తెల్లవారుజామున 02:25 గంటలకు మొదలై, సెప్టెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12:14 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకుని, సెప్టెంబర్ 4వ తేదీనే ఈ వ్రతాన్ని ఆచరించాలి. విశేషం ఏమిటంటే, ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కూడా ఇదే రోజున రావడం అత్యంత శుభకరం.
భైరవ పూజా విధానం..
పండుగ రోజున వేకువజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన, ఉతికిన దుస్తులు ధరించాలి. మనసులో స్వామివారిని ధ్యానిస్తూ ఉపవాస దీక్ష తీసుకోవాలి. పూజా సమయం.. కాలాష్టమి రోజున పూజను సాయంత్రం లేదా రాత్రి సమయంలో చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు సూచిన్నారు.
దీపారాధన..
ఇంటి పూజా మందిరంలో పరమశివుడు లేదా కాలభైరవ స్వామి చిత్రపటాన్ని ఉంచి, నువ్వుల నూనెతో గానీ లేదా నెయ్యితో గానీ దీపారాధన చేయాలి.
అలంకరణ, నైవేద్యం..
భైరవ స్వామికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పూలు, బిల్వ పత్రాలు, భస్మం, గంధం, అక్షతలు సమర్పించి, నైవేద్యంగా పండ్లు, తీపి పదార్థాలు ఉంచాలి. ఆరాధన సమయంలో "ఓం కాలభైరవాయ నమః" లేదా "ఓం భైరవాయ నమః" అనే మంత్రాన్ని జపించడం ఉత్తమం. ఆదిశంకరాచార్య కృత 'కాలభైరవ అష్టకం', 'కాలభైరవ చాలీసా' పఠించి చివరగా స్వామికి హారతి ఇవ్వాలి. పూజ అనంతరం భైరవుని వాహనమైన కుక్కకు ముఖ్యంగా నల్ల కుక్కకు పాలు, తీపి రొట్టెలు తినిపించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
కాలాష్టమి వ్రత ప్రాముఖ్యత..
ధర్మం, సమయం, రక్షణలకు కాలభైరవుడు అధిపతి. కాలాష్టమి రోజున ఆయనను శరణు కోరితే ఎన్నో లాభాలు చేకూరుతాయి. శత్రు, భయ నాశనం..అకారణ భయాలు, శత్రు బాధలు, అజ్ఞాత ప్రతికూల శక్తుల నుంచి స్వామి తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతాడు. అపారమైన ధైర్యం కలుగుతుంది. నిష్టగా ఉపవాస దీక్షతో కాలభైరవుడిని స్మరిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని ప్రతీతి.
గ్రహ దోష శాంతి.. జాతకంలో రాహు, కేతువుల వల్ల కలిగే దుష్ప్రభావాలు అంటే గ్రహ దోషాలు స్వామివారి అనుగ్రహంతో తగ్గుముఖం పడతాయి. మొత్తంగా చెప్పాలంటే కాలాష్టమి నాడు ఉపవాసం ఉండి భక్తితో స్వామిని ఆరాధించే భక్తులకు అపారమైన ఆత్మవిశ్వాసం, ఆయురా రోగ్యాలు, జీవితంలో సుఖసంతోషాలు సిద్ధిస్తాయి.
