devotional news

పితృ పక్షాలు 2026: సెప్టెంబర్ 26 నుంచి మహాలయ పక్షాలు.. ముఖ్యమైన తేదీలు, శ్రాద్ధ కర్మల నియమాలు..!

 

హిందూ ధర్మంలో పెద్దల పట్ల భక్తిప్రపత్తులను, కృతజ్ఞతను చాటుకునే పవిత్రమైన సమయమే 'పితృ పక్షాలు' వీటినే మహాలయ పక్షాలు అని కూడా అంటారు. ఈ రోజుల్లో మనకు జన్మనిచ్చి, విద్యాబుద్ధులు నేర్పి, ప్రయోజకులను చేసిన పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, పిండప్రదానాలు ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. హిందూ పంచాంగం ప్రకారం, 2026 సంవత్సరంలో పితృ పక్షాలు సెప్టెంబర్ 26వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజున 'పౌర్ణమి శ్రాద్ధం'తో పితృ కర్మలు మొదలవుతాయి. మరుసటి రోజు సెప్టెంబర్ 27 పాడ్యమి శ్రాద్ధంతో మరణ తిథి ఆధారంగా చేసే శ్రాద్ధాల క్రమం ఆరంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజులు అక్టోబర్ 10వ తేదీ శనివారం 'సర్వపితృ అమావాస్య'తో ముగుస్తాయి.


పితృ పక్షాల్లోని ముఖ్యమైన తేదీలు - విశేషాలు..


పితృ పక్షాల్లో ఏ రోజు ఏ శ్రాద్ధం నిర్వహించాలో ఇప్పుడు చూద్దాం.. 


సెప్టెంబర్ 26 (పౌర్ణమి శ్రాద్ధం)..పితృ పక్షాల ప్రారంభం. పౌర్ణమి తిథిన మరణించిన వారికి ఈ రోజున శ్రాద్ధం చేస్తారు.


సెప్టెంబర్ 27 (పాడ్యమి శ్రాద్ధం)..ప్రతిపద లేదా పాడ్యమి తిథితో క్రమం ప్రారంభమవుతుంది.


సెప్టెంబర్ 29 (మహా భరణి శ్రాద్ధం)..తృతీయ (తదియ) శ్రాద్ధంతో పాటు మహా భరణి శ్రాద్ధం చేస్తారు. భరణి నక్షత్రం పితృ కర్మలకు అత్యంత విశేషమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.


సెప్టెంబర్ 30 (చవితి, పంచమి శ్రాద్ధాలు)..చవితి, పంచమి తిథుల్లో మరణించిన పూర్వీకులకు ఈ రోజున పితృ కర్మలు ఆచరిస్తారు.


అక్టోబర్ 4 (మాతృ నవమి)..దీనినే నవమి శ్రాద్ధం అంటారు. కుటుంబంలో మరణించిన స్త్రీలకు (తల్లి, అమ్మమ్మ, నానమ్మ తదితరులకు) ఈ రోజున విశేషంగా శ్రాద్ధ కర్మలు చేస్తారు. ఇది మహిళలకు అంకితమైన పవిత్రమైన రోజు.


అక్టోబర్ 7 (మఘా శ్రాద్ధం).. ఈ రోజున ద్వాదశి శ్రాద్ధం ఉంటుంది. ధార్మిక విశ్వాసాల ప్రకారం మఘా నక్షత్రానికి పితృదేవతలతో ప్రత్యేక సంబంధం ఉంది. కాబట్టి ఈ రోజు చేసే తర్పణాలకు విశేష ఫలితం ఉంటుంది.


అక్టోబర్ 9 (చతుర్దశి శ్రాద్ధం)..చతుర్దశి నాడు మరణించిన వారితో పాటు, అకాల మరణం లేదా అసహజ మరణం పొందిన వారికి ఈ రోజున శ్రాద్ధం నిర్వహించడం ఆనవాయితీ.


అక్టోబర్ 10 (సర్వపితృ అమావాస్య).. పితృ పక్షాల చివరి రోజు. దీనినే 'మహాలయ అమావాస్య' అని కూడా అంటారు.


పూర్వీకులకు శ్రాద్ధం ఏ తిథిన చేయాలి..?


పితృ పక్షాలలో శ్రాద్ధ కర్మలకు పూర్వీకుల మరణ తిథి అత్యంత కీలకం. సాధారణ ధార్మిక ఆచారాల ప్రకారం, ఒక వ్యక్తి ఏ తిథిన మరణించారో, పితృ పక్షాల్లో వచ్చే అదే తిథి నాడు వారికి శ్రాద్ధం నిర్వహించాలి. ఉదాహరణకు.. ఒకరు విదియ రోజు మరణిస్తే, పితృ పక్షాల్లో వచ్చే విదియ నాడే వారి పేరు మీద శ్రాద్ధ కర్మలు చేయాలి. తదియ, చవితి, పంచమి ఇలా ఏ తిథికి ఆ తిథి నియమం వర్తిస్తుంది.


తిథి తెలియకపోతే ఏం చేయాలి..?


కొంతమందికి తమ పూర్వీకులు మరణించిన కచ్చితమైన తిథి గుర్తుండకపోవచ్చు. లేదా అనివార్య కారణాల వల్ల ఆయా నిర్దేశిత తిథుల్లో శ్రాద్ధం చేయడం వీలుకాకపోవచ్చు. అలాంటి వారు పితృ పక్షాల చివరి రోజైన సర్వపితృ అమావాస్య అంటే మహాలయ అమావాస్య నాడు తమ పూర్వీకులందరినీ తలుచుకుంటూ సామూహికంగా తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం శాస్త్ర సమ్మతం. ఇలా చేయడం వల్ల పితృ దేవతలు సంతృప్తి చెంది, వంశాభివృద్ధిని ఆశీర్వదిస్తారని ప్రతీతి.

తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బà...

View Post

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

September 25, 2026

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు...

View Post

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 24, 2026

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్స...

View Post

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

September 24, 2026

 తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైà...

View Post

అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారి దివ్యదర్శనం

September 23, 2026

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎని...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 227683