చంద్రగ్రహణం ప్రభావం: 10.30 గంటల పాటు మూతపడిన శ్రీవారి ఆలయం



నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మంగళవారం చంద్రగ్రహణం నేపథ్యంలో నిశ్శబ్దంగా మారింది. గ్రహణ ప్రభావంతో దాదాపు 10 గంటల 30 నిమిషాల పాటు ఆలయ తలుపులు మూసివేశారు.
ఉదయం 9 గంటలకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో అర్చకులు బంగారు వాకిలి, వెండి వాకిలి, మహాద్వారం తలుపులను మూసివేశారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6.47 గంటలకు ముగిసింది. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి శుద్ధి కార్యక్రమాలు, పుణ్యాహవచనం వంటి కైంకర్యాలు నిర్వహించారు. రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి.
గ్రహణం కారణంగా అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్లు కూడా తాత్కాలికంగా మూసివేయగా, భక్తులకు పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది భక్తులు అలిపిరి వద్దే వంటలు చేసుకుంటూ కనిపించారు.
శ్రీశైలంలోనూ ఆలయ ద్వారాలు మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా తెల్లవారుజామున ప్రాతఃకాల పూజల అనంతరం ప్రధాన ద్వారాలు మూసివేశారు. గ్రహణం ముగిసిన తరువాత సాయంత్రం 7.30 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉభయ దేవాలయాలతో పాటు పరివార, అనుబంధ ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీకాళహస్తి, పిఠాపురంలో ప్రత్యేక అభిషేకాలు

అయితే శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణ సమయంలో కూడా దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. గ్రహణ ఉచ్ఛకాలంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
అలాగే కాకినాడ జిల్లాలోని పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో కూడా గ్రహణ సమయంలో ఆలయం తెరిచి ఉంచి కుక్కుటేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
చంద్రగ్రహణం ప్రభావంతో పలు ప్రముఖ క్షేత్రాల్లో ఆచారాలు, నియమాలు పాటించగా, భక్తులు కూడా శాస్త్రోక్త విధానాలను అనుసరించారు.
