తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 7:34 గంటలకు సంప్రదాయ పద్ధతిలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించే ముందు ముద్దాడ రవిచంద్ర మొదటగా శ్రీ వరాహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మార్గం ద్వారా ఆలయ మహాద్వారం చేరుకుని, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో చి. వెంకయ్య చౌదరి ఆయనకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్య కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు. అదనపు ఈవో ఆయనకు తీర్థప్రసాదాలు మరియు స్వామివారి చిత్రపటం అందజేశారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ముద్దాడ రవిచంద్ర, తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత నెల రోజులుగా తిరుమల నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలను అధ్యయనం చేశానని, భక్తులు ఇచ్చిన సూచనలను కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులకు సేవ చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. టీటీడీ బోర్డు మరియు అధికారులతో సమన్వయంతో పనిచేసి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
